చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఉచిత ఇసుక ఒకటి. అంతే కాదు అధికారంలోకి రాగానే అమలుచేసిన మొదటి హామీ కూడా అదే! అయితే ఆచరణలో పెట్టి నాలుగు నెలలు అవుతున్నా అమలులో మాత్రం ప్రజలలో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని నింపుతోంది. అనేక చోట్ల గత ప్రభుత్వంలోని ధరల కంటే అధికంగా ఖర్చవుతోందని.. తీవ్ర ఇసుక కొరత ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఈ విషయంపై వివిధ పిర్యాదులు రావడంతో ఇటీవల సమీక్ష నిర్వహించిన ఏపి సీయం చంద్రబాబు నాయుడుతో అధికారులు “ఉచిత ఇసుక అమలులో సమస్యలున్నాయి” అంటూ తేలిగ్గా చెప్పడంతో వారిపై ముఖ్యమంత్రి అసహనం వెలిబుచ్చారు. ఉచిత ఇసుక అమలులో ఎన్నో సమస్యలు ఉంటే ఎందుకుని ఇంతకాలం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అంటూ సీఎం చంద్రబాబు అధికారులను గట్టిగా నిలదీసి 11 వ తేదీకల్లా తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గనుల శాఖ వివిధ అంశాలతో కూడిన నివేదిక సమర్పించింది. “ఆంధ్రజ్యోతి”లో ప్రచురితమైన ఈ నివేదిక అంశాల్లోకి వెళితే ..
1. ఇసుక అత్యవసరంగా కోరుకున్నవారికి బుక్ చేసుకున్న వెంటనే ఇవ్వలేకపోతున్నాం. బుకింగ్ విధానంలో ఉన్న పరిమిత ఆప్షన్‌లతో ఈ సమస్య ఉంది. అసలు స్టాక్ ఎంత ఉందనే లభ్యత వివరాలపై స్పష్టత ఉండటం లేదు. దీంతో వినియోగదాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
2. కొన్ని జిల్లాల్లో ఇసుక అందుబాటులో లేదు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో రీచ్‌లు లేవు. దీంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతూనే పక్క జిల్లాల నుంచి ఇసుక తెప్పించుకుంటున్నారు. దీనివల్ల రవాణా ఖర్చుల భారం పడుతోంది. దీంతో కొంత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
3. ఉచిత పాలసీలో భాగంగా ఇసుక తీసుకెళ్లిన వారు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీనివల్ల ప్రజలు ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఉచిత ఇసుక దారి మళ్లడం వల్ల సామాన్య వినియోగదారులకు దొరడకం లేదు.
4. బ్లాక్ మార్కెటింగ్‌తో ప్రజలు అధిక రవాణా చార్జీల భారం మోయాల్సి వస్తోంది. అలాగే, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. సొంత వాహనాల ద్వారా ఇసుకను తీసుకెళ్తున్న కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. రవాణా కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు.
5. ఉచిత ఇసుకపై తప్పుడు ఫిర్యాదులు, సమాచారం ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో ఒక విధమైన గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. ఉచిత ఇసుక పాలసీపై ప్రజల్లో ప్రతికూల అవగాహనలు నెలకొన్నాయి.
అంటూ .. ఉచిత ఇసుక అమలులో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించింది.. దీనితో పాటూ తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించింది..
క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఓ సమగ్ర అధ్యయనం జరగాలని.. ప్రభుత్వ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వారు ప్రతిపాదించారు. అంతేకాదు.. ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని .. ఇసుక కొరతను అధిగమించేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రైవేటు రీచ్‌లు తెరవాలని.. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని… బ్లాక్‌మార్కెట్‌ను అధిగమించేందుకు ఇసుక బుకింగ్‌లో ఓటీపీ విధానం ప్రవేశపెట్టాలని గనుల శాఖ నివేదికలో ప్రతిపాదించారు.