Nagula Chavithi 2024: పూజా సమయం… విధానం.. విశిష్టత

దీపావళి తర్వాత వచ్చే చవితినాడు “నాగుల చవితి” పండుగను తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు కదా.. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది.. పుట్టలో పాలు పొసెనదుకు ఏ సమయం మంచిది.. పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chavithi 2024) నవంబర్ 5, మంగళవారం నాడు చేసుకోనున్నారు. నిజానికి నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం కానుంది. ఇది నవంబర్ 5వ తేదీ రాత్రి 8. 56 నిమిషాల వరకు ఉంటుంది. అంటే 5 వ తేదీన సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిధి ఉంది కనుక నవంబర్ 5వ తేదీన నాగుల చవితి జరుపుకోవాలని శాస్త్ర పండితులు భక్తులకు సూచిస్తున్నారు.

అలాగే మంగళవారం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 1.10 లోగా నాగదేవత విగ్రహానికి పూజ చేస్తే అధ్బుతమైన ఫలితాలు కలుగుతాయని వారు వెల్లడిస్తున్నారు.

నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేస్తారు.అనంతరం చలిమిడి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మెుదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాడు మిగిలిన కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి కాలుస్తారు. హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా నాగుల చవితికి సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విష గుణాలు పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణ కథనం ఒకటి చెబుతోంది. 

పురాణాల ప్రకారం, నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఎన్నో దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహా విష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రుని భక్తులందరూ నాగ దేవతను పూజిస్తే సర్వరోగాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈరోజు సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే.. పిల్లలు కలుగుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ నాగరాజును భక్తిశ్రద్ధలతో ఆరాధించి మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ప్రజల నమ్మకం. 

Join WhatsApp Channel