వైసీపీని వీడిన గన్నవరం నేత యార్లగడ్డ, జగన్ కు సవాల్

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ, వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచే వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేద్దామనుకున్నారు. కానీ అధిష్టానం వంశీకే సీటు ఖరారు చెయ్యడంతో ఇక చేసేది లేక వైసీపీకి గుడ్ బై చెప్పారు.

వైసీపీని వీడిన గన్నవరం నేత యార్లగడ్డ, జగన్ కు సవాల్

దీనిపై మాట్లాడేందుకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. తాను సీఎం జగన్ ను టిక్కెట్ ఇవ్వాలని మాత్రమే అడిగానని తెలిపారు. పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో ఏమో తనకు తెలియలేదని చెప్పారు. తనను ఎక్కడైనా పార్టీ సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నేను గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో నీకు ఎదురు పడతానని సీఎం జగన్ కి సవాల్ విసిరారు యార్లగడ్డ.

టీడీపీ కంచుకోటలో తాను ఢీ అంటే ఢీ అని పోరాడానని గుర్తు చేశారు. ఆ బలమే ఇప్పుడు బలహీనత అయిందా? అని ప్రశ్నించారు. అప్పుడు పెట్టిన కేసులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని, టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని నిలదీశారు యార్లగడ్డ. తడి గుడ్డతో గొంతు కోయడం అనేది తన విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు.

Join WhatsApp Channel