వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఈ రెండు ఉంటే కనుక తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ… ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆ పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కొంతమంది నేతలు మాట్లాడితే చేతులు, కాళ్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొడతామని విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ… చెప్పులు ఎవరికి ఉండవు.. అందరికీ ఉంటాయన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా జగన్‌ను తిడుతూ పోతే ఎవరూ హర్షించరని తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం పర్యటిస్తున్న పవన్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చిత్తశుద్ది లేని టీడీపీ, జనసేనలు త్వరలో కనుమరుగైపోతాయని విమర్శించారు. ప్రజలనాడి తెలిసిన వ్యక్తిగా తాను ఈ విషయం చెబుతున్నానని, తన అనుభవంతో చెబుతున్నట్లు తెలిపారు. ఇదేదో గొప్ప కోసం తాను చెప్పడం లేదని, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉండే పార్టీలు మాత్రమే ఉంటాయన్నారు. టీడీపీ, జనసేనలకు అలాంటి ఉద్దేశమే లేదన్నారు.