ఒక పండితుడు
ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూరమృగాలను చూడగానే
అతడి గుండె జారిపోయింది. దారికోసం అటు ఇటు తిరుగుతున్నాడు. మృగాలు అతడి
చుట్టూ సంచరిస్తున్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది.
భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది.
తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి ఉన్న బావిలో అతడు పడిపోయాడు. తీగల
మధ్య కాలు చిక్కుపడి తలకిందులుగా వేలాడుతున్నాడు. ఆ బావిలో ఒక పెద్ద సర్పం
కనిపించింది. బావి బయట ఆరు ముఖాలతో పన్నెండు కాళ్లతో సగం నలుపు తెలుపుగా
ఉన్న ఒక ఏనుగు మెల్లగా కదులుతోంది. ఆ బావి తీగల మధ్య తేనెపట్టు ఉంది. ఆ
తేనె ధారలు అతడి పెదవిపై పడుతున్నాయి. వాటిని తాగుతున్నా అతడికి తృప్తి
కలగడంలేదు. బావి దగ్గర ఉన్న ఒక వృక్షాన్ని నల్లగా తెల్లగా ఉన్న ఎలుకలు
కొన్ని తొలిచేస్తున్నాయి. ఆ విధంగా అక్కడ మృగాలు, భయంకర రూపం గల స్త్రీ,
బావి లోపల పెద్ద సర్పం, బయట ఆరు ముఖాలు పన్నెండు కాళ్లు గల ఏనుగు,
పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, తేనెటీగలతో నిండిన తేనె పట్టు… ఇలా
వీటి మధ్య ఉన్నప్పటికీ అతడికి జీవితంపై ఆశ చావలేదు. నిర్వేదం కలగలేదు.
మహాభారత యుద్ధానంతరం స్త్రీ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ కథ
చెప్పి ‘మహారాజా! ఈ కథను మోక్షజ్ఞులు జీవితానికి ఉపమానంగా చెబుతారు’ అని
ఇలా వివరించాడు- మహారణ్యమే పెద్ద సంసారం. క్రూరమృగాలు వ్యాధులు. భయంకరమైన ఆ
స్త్రీ వార్ధక్యం. బావి శరీరం. దానిలో ఉన్న మహా సర్పం కాలం. కూపం మధ్యలో ఏ
తీగల మధ్య తలకిందులుగా వేలాడుతున్నాడో- అది జీవితాశ. ఆరు ముఖాలు గల ఏనుగు
ఆరు ఋతువులు. దాని పన్నెండు కాళ్లూ పన్నెండు మాసాలు. చెట్టును తొలుస్తున్న
నల్ల తెల్ల ఎలుకలు రాత్రి పగళ్లు. తేనె పట్టు కామం. సంసారమే దుర్గమమైన
అరణ్యం. కుమారులు మరణించారని విలపిస్తున్నావు. ఒక్కోసారి చక్రంపై
మట్టిపాత్ర తయారవుతున్నప్పుడే నశిస్తుంది. కొంచెం తయారయ్యాక ఒకటి
పాడవుతుంది. ఒకటి పూర్తిగా తయారయ్యాక బద్దలవుతుంది. కిందకు దింపుతున్నపుడు,
కాలుస్తున్నప్పుడు, వాడుతున్నప్పుడు పాత్రలు నశిస్తాయి. అలాగే ప్రాణులు
గర్భంలో ఉండగా, ప్రసవం అయిన తరవాత, ఒక రోజు తరవాత, ఒక నెల లేదా సంవత్సరం
తరవాత, వార్ధక్యంతో కొన్ని, రోగాలతో కొన్ని, కర్మ ఫలితాలుగా కొన్ని
నశిస్తాయి. పోయినవారి గురించి దుఃఖించడం మాని చేయవలసిన పనులపై దృష్టి
పెట్టు.
ప్రాణులు మొదట లేవు. మధ్య కాలంలో కొంతవరకు ఉంటాయి. మరలా నశించిన తరవాత
ఉండవు. కాలం మహా స్వరూపంతో ముందుకు వెళ్తుంది. కాలానికి ఎవరిపైనా కక్ష
ఉండదు. ఇష్టమూ ఉండదు. చేసిన కర్మ మాత్రం అనుభవించక తప్పదు. నీ కుమారులందరూ
కాలవశాన చేసిన కర్మలకు బాధ్యులయ్యారు అని విదురుడు ధృతరాష్ట్రుణ్ని
ఓదార్చాడు.
ఈ కథ, ఈ ఓదార్పు సర్వ మానవులకు అవసరమే. సంక్షుభిత దుఃఖంలో
చిక్కుకున్నప్పుడు మన స్వస్వరూప జ్ఞానం తెలుసుకొని ఆత్మ సంయమనంతో
జీవించడానికి, తమసోమా జ్యోతిర్గమయ అని కాంక్షించడానికి, ప్రార్థించడానికి
మహాభారతంలో అనేక ఘట్టాలు ఉపయోగపడతాయి.
శివలెంక ప్రసాదరావు