సంకష్టి చతుర్థి లేదా సంకటహర చతుర్థి, అనేది హిందూ క్యాలెండర్‌లోని ప్రతి చంద్ర మాసంలో వచ్చే పవిత్రమైన పండుగ. ఈరోజున గణేశుని కొలుస్తారు. ప్రతీ నెలా పౌర్ణమి తర్వాత కృష్ణ పక్షంలో ప్రతి 4వ రోజు ఈ చతుర్థి వస్తుంది.
ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే, దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు.ఇది అన్ని సంకటహర చతుర్థి రోజులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఆషాఢ మాసంలో కృష్ణ పక్ష సంక్షా చతుర్థి వ్రతాన్ని ఆషాఢ సంకాశ చతుర్థి లేదా గజాన సంకాశ చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున విఘ్నాలను తొలగించే గణేశుడిని పూజించడం వల్ల మనిషికి ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని మరియు మనిషికి ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
‘సంకష్టి’ అనే సంస్కృత పదానికి ‘కష్ట సమయాల్లో విముక్తి’ అని అర్ధము ఉంది. ‘చతుర్థి’ అంటే ‘నాల్గవ రోజు’ అదే చవితి. కాబట్టి, ఈ శుభప్రదమైన రోజున, భక్తులు జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు ప్రతి క్లిష్ట పరిస్థితిలో విజయం సాధించడంలో సహాయపడటానికి గణేశుడిని పూజిస్తారు.
ఈరోజు ఆషాఢ సంకష్టి చతుర్థి: తిథి ఎప్పుడు వచ్చిందంటే
జూలై 24 న ఆషాడ సంకష్టి చతుర్థి వచ్చింది. హైదరాబాద్ లో ఈ తిథి సమయాలు చూద్దాం.
చతుర్థి తిథి ప్రారంభ సమయం – జూలై 24, 7:30 ఉదయం
చతుర్థి తిథి ముగింపు సమయం – జూలై 25, 4:40 ఉదయం
చంద్రోదయం సమయం – జూలై 24, 9:40 రాత్రి
చంద్రాస్తమయం సమయం – జూలై 25, 9:45 ఉదయం
సంకటహర చతుర్థి ఆచారాలు
సంకటహర చతుర్థి రోజున, భక్తులు తెల్లవారుజామున లేచి గణేశుడిని ఆరాధిస్తారు. కొందరైతే కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. పాక్షిక ఉపవాసాన్ని కూడా పాటించవచ్చు.. పాక్షిక ఉపవాసంలో పండ్లు, ద్రవాలను మాత్రమే సేవిస్తూ రోజంతా గణేశుని ఆరాధనలో ఉంటారు. అదీ కుదరని వారు ‘గణేశ అష్టోత్రం’, ‘సంకష్టనాశన స్తోత్రం’ మరియు ‘వక్రతుండ మహాకాయ’ లాంటి స్తోత్రాలు పఠిస్తూ సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత సంకష్ఠి పూజ చేస్తారు.
నిజానికి ఈ పూజలో ప్రతి నెలకు ఒకటి, 13వ కథ అధికమాసం కలిపి మొత్తం 13 వ్రత కథలు ఉన్నాయి. ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటంటే, ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి అంటారు.
ప్రతి నెల సంకష్టి గణపతి పూజ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
హిందూ చంద్ర మాసం | వినాయకుని పేరు | పీఠం పేరు |
---|---|---|
చైత్ర మాసం | వికట మహా గణపతి | వినాయక పీఠం |
వైశాఖ మాసం | చనక్ర రాజా ఏకదంత గణపతి | శ్రీచక్ర పీఠం |
జేష్ట మాసం | కృష్ణ పింగళ మహా గణపతి | శ్రీ శక్తి గణపతి పీఠం |
ఆషాడ మాసం | గజానన గణపతి | విష్ణు పీఠం |
శ్రావణ మాసం | హేరంబ మహా గణపతి | గణపతి పీఠం |
భాద్రపద మాసం | విఘ్నరాజ మహా గణపతి | విఘ్నేశ్వర పీఠం |
ఆశ్వయుజ మాసం | వక్రతుండ మహా గణపతి | భువనేశ్వరి పీఠం |
కార్తీక మాసం | గణదీప మహా గణపతి | శివ పీఠం |
మార్గశిర మాసం | అకురాత మహా గణపతి | దుర్గా పీఠం |
పుష్య మాసం | లంబోదర మహా గణపతి | సౌర పీఠం |
మాఘ మాసం | ద్విజప్రియ మహా గణపతి | సామాన్య దేవ పీఠం |
పాల్గుణ మాసం | బాలచంద్ర మహా గణపతి | ఆగమ పీఠం |
ఆదిక మాసం | విభువన పాలక మహా గణపతి | దూర్వ బిల్వ పత్ర పీఠం |
ఈ మాసం ఆషాడం కనుక “గజానన గణపతి”గా వినాయకుని పూజించాలి.
సంకటహర చతుర్థి పూజా విధానం
ఈ పూజలో, గణేశుడి విగ్రహాన్ని దుర్వ గడ్డి మరియు తాజా పూలతో అలంకరించి. దీప, ధూపాలతో వేద మంత్రాలను పఠిస్తూ గణపతి పూజ నిర్వహిస్తారు. వినాయకునికి ఇష్టమైన బెల్లంతో చేసిన కుడుములు లేదా పాయసం నివేదిస్తారు.
అనంతరం చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. సంకష్టి చతుర్థి రోజున, ప్రత్యేక పూజ ఆచారాలు చంద్రునికి కూడా చేస్తారు. చంద్ర దర్శనం సమయంలో చంద్రుని దిశలో నీరు, గంధపు నీరు, బియ్యం మరియు పువ్వులు చల్లుతారు.