ఏపిలో రేషన్ కార్డుల కోతకు రంగం సిద్దం.. ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

అనేక హామీలతో అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటి అమలులో తర్జన బర్జన పడుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి టోల్ గేట్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చిన ప్రభుత్వం ఖజానాపై భారాన్ని తగ్గించుకొనేందుకు వివిధ రూపాలలో ప్రయత్నిస్తోంది. దీనికోసం వివిధ అంశాలపై అధకారుల నుండి నివేదికలు కోరింది.

ప్రస్తుతం దాదాపు ప్రతీ పధకానికి రేషన్ కార్డుతో ముడిపడి ఉంది. అమ్మ వొడి, ఫీజు రీయంబర్స్మెంట్ సహా అనేక పథకాలు రేషన్ కార్డు ఆధారంగా అర్హత నిర్ణయిస్తున్నారు.
దీనిపై వివిధ కోణాల్లో విశ్లేషించిన అధికారులు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో కోటీ నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని వాటిలో 90 లక్షలకే కేంద్ర గుర్తింపు ఉందని.. మిగతా 58 లక్షల కార్డుల భారం రాష్ట్రంపై పడుతున్నదని..
అలాగే కోటీశ్వరులైన వారు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, దాదాపు 90 శాతం కుటుంబాలు ప్రస్తుతం తెల్ల కార్డులు కలిగి ఉన్నాయని అధికారులు నివేదించారు. వీటి ఏరివేతకు వారు కొన్ని సూచనలు కూడా చేశారు. ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోని వారు దాదాపు 1,36,000 మంది ఉన్నారని , ఆ కార్డులను తక్షణం తొలగించడం వల్ల ఖజానాపై రూ . 90 కోట్ల భారం తగ్గుతుందని కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అంతే కాదు… గతంలో రేషన్ కార్డులలో రెందురకాలు ఉండేవని దిగువ తరగతి ప్రజలకు తెలుపు రంగు , మధ్య తరగతి ప్రజలకు గులాబీ రంగు రేషన్ కార్డులు ఉండేవని ఆ రకంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను విభజించిన పక్షంలో దాదాపు సగం ఖర్చు ఖజానాపై పడకుండా ఉంటుందని అధికారులు ప్రతిపాదించినట్లు చెపుతున్నారు.

అయితే ఈ విషయంపై చంద్రబాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి..

Join WhatsApp Channel