ఏలూరులో టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబుతో ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆయన తాజా రాజకీయ పరణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం-జనసేన పొత్తులో వెళుతున్న క్రమంలో ముద్రగడ మాగంటిని కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. చంద్రబాబు సభ చింతలపూడిలో జరిగిన మర్నాడే వీరిద్దరూ కలుసుకోవడం కొంచెం ఆసక్తికరంగా నిలిచింది.
టిడిపి- జనసేన పొత్తులో వెళ్ళడం మంచిదే అని ముద్రగడ చెప్పినట్లు మీడియాలో వచ్చింది. మాగంటి బాబు ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఇటీవల టిడిపి ఏలూరు ఎంపీ సీటు మరొకరికి కేటాయిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పొత్తు చర్చలు జరుగుతున్న తరుణంలో అందరూ సంయమనం పాటించాలి అని ముద్రగడ ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే భేటీ అనంతరం మాగంటి మాట్లాడుతూ “మా కుటుంబం అంటే ముద్రగడకు అభిమానం అని, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. మా తండ్రి కాలం నుంచి ఫ్యామిలీ స్నేహితులం” అని చెపుతూ, “తనను వైసీపీ-టిడిపి లు మోసం చేశాయి అని ముద్రగడ చెప్పారు, రాజ్యసభ సీటు ఇస్తాం అని బేరాలు ఆడారు. ప్రస్తుత పరిస్థితిలో తన మనసుకు తగిలిన గాయం మానాక పవన్ కళ్యాణ్ ని కూడా కలుస్తాను అని చెప్పారు” అన్నారు.