Toll Gates: రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు.. ఇకపై రోడ్డెక్కితే జేబుకి చిల్లే

ఇకపై ఏపిలో ఒక ఊరు నుంచి మరో ఊరుకి వెళ్లాలంటే కారులో పెట్రోలే కాదు జేబులో డబ్బులు కూడా ఉండాలి.. ఇప్పటి దాకా కేవలం జాతీయ రహదారులపైన మాత్రమే ఉన్న టోల్ గేట్లు ముందు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలను కలిపే రోడ్లపై కూడా రాబోతున్నాయి.

Toll Gates: రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు.. ఇకపై రోడ్డెక్కితే జేబుకి చిల్లే
Toll Gates: రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు.. ఇకపై రోడ్డెక్కితే జేబుకి చిల్లే

సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో అద్వానంగా ఉన్న రోడ్లను ప్రభుత్వ, ప్రయివేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది బాబు సర్కార్. ఇప్పటికే కొన్ని కీలక రోడ్లను గుర్తించిన సర్కార్ వాటి నిర్మాణానికి టెండర్లు పిలిచే దిశగా అడుగులు వేస్తుంది. సుమారు 22 ప్రధాన రాష్ట్ర రహదారులను గుర్తించిన ప్రభుత్వం వాటిని ప్రయివేట్ కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణం చేసి .. ఆ వ్యయాన్ని టోల్ చార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.. దీనివల్ల ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టర్ కు చెల్లించే బాధ తప్పుతుందని.. నిర్మాణ ఖర్చును.. నిర్వహణా వ్యయాన్ని ప్రజల నుంచి వసూలు చేసుకోవచ్చని ఆలోచిస్తోంది.

లారీలు, కార్లపై ఈ రుసుము విధిస్తారని నిన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు ఒక ప్రముఖ వార్తా సంస్థ తెలియచేసింది.

నిజానికి 2016 లోనే రాష్ట్రంలో 12,653 కిలో మీట‌ర్ల రాష్ట్ర ర‌హ‌దారులలో.. 31 రోడ్ల‌ను పీపీపీ ప‌ద్ద‌తిలో చేప‌ట్టాల‌ని అప్పటి చంద్రబాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించేసింది. కానీ అప్ప‌టికే క‌రెంటు ఛార్జీలు పెంపు, రాష్ట్రంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంతో అదికాస్తా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ తర్వాత జగన్ సర్కారు ఆ ఆలోచనను విరమించింది. ఇప్పుడు మళ్ళీ బాబు సర్కార్ ఆనాడు ఎంపిక చేసిన 31 రోడ్లలోని 10 రోడ్లను అత్యవసరంగా పీపీపీ మోడ‌ల్‌లో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించాల‌ని రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

అయితే .. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యే సూచనలు కలిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పెరిగిన రోడ్డు ట్యాక్స్ భారంగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర రాహ‌దారుల‌పై టోల్‌గేట్లు పెట్టి టోల్ ట్యాక్స్ వ‌సూలు చేస్తే అద‌న‌పు భార‌మే అవుతుందని ప్ర‌తిప‌క్షాలు విమర్శిస్తున్నాయి.

టోల్ ప్ర‌తిపాద‌న‌ను విరమించుకోవాలి: సీపీఎం

రాష్ట్ర ర‌హ‌దారుల‌పై టోల్ ఛార్జీలు వ‌సూలు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకోవాల‌ని సీపీఎం రాష్ట్ర క‌మిటీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి వీ.శ్రీ‌నివాస‌రావు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రోడ్ల‌ను అభివృద్ధి చేయ‌డం, వాటిని స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ బాధ్య‌త‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే వాహ‌నదారుల‌కు లైఫ్ ట్యాక్స్‌, రోడ్ ట్యాక్స్‌, డీజీల్‌, పెట్రోల్‌పై సెస్‌లు వేయ‌డంతో భారం పెరుగుతోంద‌ని అన్నారు. ఈ ప్ర‌తిపాద‌న రాష్ట్ర ర‌వాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుంద‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై అద‌న‌పు భారం ప‌డ‌కుండా రాష్ట్ర ర‌హ‌దారుల‌పై టోల్ ట్యాక్స్ ప్ర‌తిపాద‌న విర‌మించుకోవాల‌ని కోరారు.

టోల్ ట్యాక్స్ వ‌సూలు చేయ‌డం దారుణం: ఓన‌ర్స్ అసోసియేష‌న్

ఇప్ప‌టికే రోడ్డు ట్యాక్స్ పెరిగ‌డం వ‌ల్ల క‌ట్టలేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ర‌హ‌దారుల‌కు కూడా టోల్ ట్యాక్స్ వ‌సూలు చేయ‌డం దారుణ‌మ‌ని ఏపీ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వైవీ ఈశ్వ‌ర‌రావు తెలిపారు. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాల‌ని, లేక‌పోతే మిగ‌తా ట్యాక్స్‌ల‌న్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Join WhatsApp Channel