పవిత్రమైన శ్రావణ మాసంలో పండుగలు పొదటి రోజు మొదలుకుని చివరి రోజు అయిన అమావాస్య వరకు ఉంటాయి. చివరి రోజు అయిన అమావాస్య నాడు (సెప్టెంబర్ 2, 2024 సోమవారం) పోలాల అమావాస్య వచ్చింది. పోలా అనగా ఎద్దు (పశువు) అని అర్ధం. బహుళ పక్షంలో అష్టమ, నవమి, దశమి రోజుల్లో నాగళ్ల పూజ చేస్తారు కదా.. అప్పుడు మొదలు పెట్టి అమావశ్యకు వచ్చేసరికి ఒక కంద పిలకను పెట్టి పూజ చేస్తారు.
కంద పిలక ఎందుకు పెడతారు?
చిన్న కంద పిలక భూమిలో పెట్టినా శాఖోప శాఖలుగా విస్తరిస్తుంది. అలాగే తమ కుటుంబం కూడా ఇలా శాఖోప శాఖలుగా విస్తరించాలి అని.. వంశాభివృద్ది కోసం .. పుత్ర జననం కోసం ఇలా కంద పిలక పెట్టడంలోని ఆంతర్యం.
పిల్లల కోసం నైవేద్యం
ఇలా కంద పిలక పెట్టి గణపతికి, అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి .. తమ కోరికలు చెప్పికుంటారు.. క్రొత్తగా పెళ్ళయిన వారు.. పిల్లలు కావాల్సిన వారు.. తమకు మగ పిల్లవాదో,ఆడపిల్లో ఎవరు కలుగాలో అక్కడ కోరికలు చెప్పుకుంటారు.
ఇలా చెప్పుకునే ముందు మగపిల్లవాడు కావలిస్తే గారెలు.. ఆడపిల్ల కలుగాలంటే బూరెలు నైవేద్యంగా పెడతారు.
సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే అమావస్యను “పోలాల అమావాస్య” అని జరుపుకుంటారు. కొందరు భాద్రపడ మాసంలో వచ్చే అమావాస్యను కూడా పొలాల అమావస్యగా జరుపుకుంటారు.
అయితే ఆరోజు పోలమాంబఅమ్మ, పోలేరమ్మ పూజ కూడా జరిపే ఆచారం ఉంది. పొలిమెరను కాపాడే అమ్మ పోలేరమ్మ.. అంటే ఆరోజు తమ తమ గ్రామ దేవతలను పూజించవచ్చు. గడపలకు పసుపు రాసి, చద్ది నివేదన పెట్టి పూజలు చేయాలి.
చద్ది నివేదన అంటే?
అన్నాన్ని వండి బాగా చల్లారిన తర్వాత, కాస్త ఉప్పు, తియ్యటి పెరుగు కలిపి నివేదన చేయాలి. అటు తర్వాత చివరిగా అమ్మవారికి తమ కోరికలు నివేదించుకోవాలి.