Vinayaka Vratha Katha PDF: వినాయక చవితి వ్రత కథ, పూజా విధానం (సవివరంగా)

హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ వినాయకచవితి పండుగ. పురాణాల ప్రకారం భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు విఘ్నేశ్వరుడి జననం జరిగినట్లుగా చెబుతారు. అయితే కొందరు ఆరోజున గణాధిపత్యం పొందిన రోజని భావిస్తారు.

మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు ఆయనే ప్రభువన్న మాట. అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి. గణపతిని తలచుకుంటే చేపట్టిన కార్యక్రమం, మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితే.

వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించారు. ఆ రోజు మట్టితో వినాయకుని ప్రతిమని చేస్తారు. అలానే పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్టించిన చోటే ఉంచి పూజిస్తారు. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి.

పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. వినాయకుని పూజకి 21 రకాల ఆకులని ఉపయోగిస్తారు. పూజ కి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలానే ఆవిరి పైన చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు.ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

Vinayaka Vratha Katha PDF: వినాయక చవితి వ్రత కథ, పూజా విధానం (సవివరంగా)

ముందుగా బొట్టు పెట్టుకుని, దీపారాధన చేసి, నమస్కరించుకుని, దిగువ విధంగా ప్రార్ధించుకోవాలి

ప్రార్ధన :

శ్లో॥ శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే॥

ఆయం ముహూర్తస్సు ముహూర్తోస్తు॥

శ్లో॥ తదేవలగ్నం సుదినంతదేవ, తారాబలం చంద్రబలం తదేవ |

విద్యాబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్ర యుగం స్మరామి ॥

సుముహూర్తోస్తు॥

శ్లో॥ లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః||

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్ధనః॥

ఆపదామసహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః, లంబోదరశ్చవికటో విఘ్నరాజో గణాధిపః||

ధూమకేతుర్గణా ధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూర్వజః॥

అష్టావష్ఠా చ నామాని యః పఠేచ్ఛృణు యాదపి||

విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యజాయతే।

అభీస్పితార్ధ సిద్ధ్యర్థం పూజితోయస్సురైరపి, సర్వ విఘ్నచ్చి దేతస్మై గణాధిపతయే నమః

(నమస్కరించుకుని, ఆచమనమూ ప్రాణాయామమూ చేసి సంకల్పము చెప్పుకోవలెను)

ఆచమనమ్

ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః

సంకల్పము

ఓం|| మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ . ……. నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ భాద్రపదమాసే, శుక్లపక్ష చతుర్ధ్వాంతిధౌ, వాసరయుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ, శ్రీమాన్… గోత్రః…. నాధేయః…… మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబస్య, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, మనోవాంఛా ఫల సిద్ద్యర్ధం, సమస్త దురితోపశాంత్యర్ధం సమస్త మంగళావాప్త్యర్ధం, వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయ చతర్థీ ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజంకరిష్యే. (నీళ్ళు తాకవలెను) అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్ధం గణాధిపతి పూజంకరిష్యే తదంగ కలశపూజాం కరిష్యే॥ కలశం గంధపుస్పాక్షతైరభ్యర్చ్య తస్యోపరి హస్తం నిధాయ-

కలశపూజ

కలశస్య ముఖేరుద్రః కంఠే విష్ణుస్సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృ తాః కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా, ఋగ్వేదోధయజుర్వేద స్సామవేదోహ్యధర్వణః, అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః॥ ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః| శ్లో॥ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు॥ – కలశోదకమును పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమ మీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.

మహా (పసుపు) గణాధిపతి పూజ

మంత్రం॥ గణానాంత్వాం గణపతిగ్ హవామహే, కవింకవీనా ముపమశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణా, బ్రహ్మణస్పత్యః అనశృణ్వన్నూతిభి స్సీదసాదనం || శ్రీ మహాగణాధిపతయే నమః॥ ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే | (పువ్వులు, అక్షతలూ కలిపి వేయాలి) యధాభాగం గడంనివేదయామి॥ శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో వరదోభవతు|| శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృప్తమి (రెండు పూజాక్షతలు తలపై వేసుకోవాలి) ॥ అథ శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే –

శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టా

(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి) శ్లో॥ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం – తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు| ఆవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (నమస్కరించుకోవాలి)

షోడశోపచారపూజ

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్న రాజమహంభజే॥ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధివినాయకమ్ ॥ ఉత్తమంగణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం॥ ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥ శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి॥ అత్రాగచ్చ జగద్వ సురరాజర్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసుముద్భవ ఆవాహయామి|| మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతామ్ – ఆసనం సమర్పయామి।। గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుషాక్షతైర్యుతమ్- అర్ఘ్యం సమర్పయామి॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణద్విరాదననః పాద్యం సమర్పయామి॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో-ఆచమనీయం సమర్పయామి॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ మధుపర్కం గృహణేదం గజవక్త్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి॥ స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గర్వాణ గణపూజిత – పంచామృత స్నానం సమర్పయామి॥ గంగానది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్యభగవ న్వుమాపుత్ర నమోస్తుతే శుద్దోదక స్నానం సమర్పయామి॥ రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం గృహోణత్వం లమ్బోదర హరాత్మజ వస్త్ర యుగ్మం సమర్పయామి॥ రాజితం బ్రహ్మసూత్రంచ కార్చినం చోత్తరీయకమ్ గృహాణదేవ సర్వజ్ఞ భక్తానా మిష్టదాయక ఉపవీతం సమర్పయామి।। చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రతిగృహ్యతామ్-గంధం సమర్పయామి॥ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే – అక్షతాన్ సమర్పయామి।। సుగన్దాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ ఏయవింశతి పత్రాణి, సంగృహాణనమోస్తుతే – పుష్పాణి పూజయామి।।

అధాంగపూజా

గణేశాయ నమః పాదౌ పూజయామి|| ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి। శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి॥ విఘ్నరాజయనమః జంఘా పూజయామి ॥ ఆఖువాహనాయమనమః ఊరూంపూజయామి ॥ హేరంబాయ నమః కటిం పూజయామి॥ లంబబోదరాయ నమః ఉదరం పూజయామి। గణనాథాయ నమః నాభిం పూజయామి || గణేశాయ నమః హృదయం పూజయామి|| స్థూలకంఠాయ నమః నమః కంఠం పూజయామి॥ స్కందాగ్రజాయనమః స్కంధౌ పూజయామి॥ పాశహస్తాయనమః హస్తా పూజయామి॥ గనవక్రాయనమః వక్త్రం పూజయామి।। విఘ్నహంత్రేయ నమః నేత్రే పూజయామి। శూర్పకర్ణాయ నమః కర్ణా పూజయామి।। ఫాల చంద్రాయ నమః లలాటం పూజయామి॥ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి || విఘ్నరాజయనమః సర్వాణ్యంగాని పూజయామి ||

అ థైకవింశతి పత్రపూజా

సుముఖాయనమః మాచీపత్రం పూజయామి।

గణాధిపాయనమః బృహతీపత్రం పూజయామి।।

ఉమాపుత్రాయనమః బిల్వా పత్రం పూజయామి।

గజాననాయన నమః దూర్వాయుగ్మం పూజయామి॥

హరసూననే నమః దుత్తూర పత్రం పూజయామి।

లంబోదరాయనమః ఒదరీపత్రం పూజయామి॥

గుహాగ్రజాయనమః అపామార్గ పత్రం పూజయామి||

గజకర్ణాయనమః తులసీ పత్రం పూజయామి||

ఏకదంతాయనమః చూపపత్రం పూజయామి।।

వికటాయనమః కరవీరపత్రం పూజయామి।।

భిన్నదంతాయనమః విష్ణుక్రాంత పత్రం పూజయామి।।

ఫాలచంద్రాయనమః మరువక పత్రం పూజయామి॥

హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి।।

శూర్పకర్ణాయనమ జాతీపత్రం పూజయామి।।

సురాగ్రజాయనమః గడ్డకీపత్రం పూజయామి।॥

ఇభవక్రాయనమః శమీపత్రం పూజయామి॥

వినాయకాయనమః అశ్వత్థపత్రం పూజయామి||

సురసేవితాయనమః అర్జున పత్రం పూజయామి॥

కపిలాయనమః – అర్కపత్రం పూజయామి॥

శ్రీ గణేశ్వరాయనమః ఏక వింశతి ప్రణాతి పూజయామి।।

(** ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీపాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హ్రస్వగ్రీవాయ నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళస్వరాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం విఘ్నకర్ర్తే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బలాయ నమః

ఓం బలోత్థితాయ నమః

ఓం భవాత్మజాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకరప్రభాయ నమః

ఓం సర్వస్మై నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్ర్తే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః

ఓం సర్వసిద్ధియే నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమారగురవే నమః

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థవనప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః

ఓం జిష్ణవే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం జితమన్మథాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షకిన్నర సేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం జ్యోతిషే నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖయే నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్త దేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విఘాతకారిణే నమః

ఓం విశ్వగ్ధృశే నమః

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం అపరాజితే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః

ఓం విఘ్నేశ్వరాయ నమః

ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః

అష్టోత్తర శత నామార్చనం సమర్పయామి.

శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం సుగందం సుమనోహరమ్, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ”॥ ధూపమాఘ్రాపయామి।।

శ్లో॥ పాద్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే, దీపం దర్శయామి,

శ్లో॥ సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాందేవ చణముద్ద్యైః ప్రకల్పితాన్॥

భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చ చోప్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక – మహానైవేద్యం సమర్పయామి॥ పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్, కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి॥ సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ, భూమ్యాం స్థితాని భగవన్ స్వీకరుష్వ వినాయక – సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి॥ ఘృతవర్తి సహస్త్రైశ్చ కర్పూరశకలై స్తథా నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ, నీరాజనం సమర్పయామి।।

శో॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే॥

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాః త్రాహిమాంకృపయా దేవశరణాత వత్సలా॥

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ॥

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా|| – ఆత్మ ప్రదక్షణ నమస్కారమ్ సమర్పయామి॥

శ్రీ వినాయక వ్రత కథ

శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుండగు భగవంతుని సృష్ఠి విశేషంబగు భరతఖండంబున ఉత్తర భాగంబున నార్యావర్తమను పుణ్యభూమియొప్పుచుండు. అందనేక ధర్మశాస్త్రపురాణేతిహాసముల జెప్పు పౌరాణికుండగు సూతుండు శౌనకాదిఋషుల కనేక శాస్త్రంబులు బోధించుచుండును. ఇట్లుండ చంద్రవంశమునందు బుట్టిన ధర్మరాజు దైవయోగంబున జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకుని అనేక వృక్ష, పక్షి, మృగంబులు గల దుర్గమంబగు అడవి ప్రవేశించి అందు వాయు భక్షకులుగ పరభక్షకులుగ తపంబు చేయుచుండెడి మహాత్మలగు ఋషులను జూచుచు, సూతుని యొద్దకు బోయి భార్యానుజులతోడ నమస్కరించి ధర్మరాజిట్లనియెను.

ఓ మహాత్మా! మేము జ్ఞాతులచే రాజ్యము, సంపద కోల్పోయి వచ్చినాము. మీ దర్శన మాత్రాన సకల పాపంబులు నశించెను. “మాయందు కృపగలిగి మరల రాజ్యాదులు గల్గునట్లు వ్రతంబానతీయవలె” నని వేడగా సూతుండిట్లనియె.

ధర్మరాజా! సమస్త పాపంబులు పోగొట్టి పుత్రపౌత్రాభివృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతము కలదు. దానిని సాంబశివుడు కుమారస్వామికుపదేశించె, నదెట్లనిన ప్రబద గణాధిసేవితంబును, నానారత్న విభూషింతబగు కైలాస పర్వతమండలి మందారవృక్ష సమీపంబున సింహాసనముపై పరమశివుడు కూర్చుని యుండితరి షణ్ముఖుండేతెంచి ఇట్లనియె.

ఓ నీలకందా! లోకంబుననుండు జనులేవ్రతము జేసిన పుత్రపౌత్రాదులు పొంది సుఖముగనుందురో అట్టి వ్రతము జెప్పుమనగా శివుడు ఓ కుమారస్వామి! ఆయువును, సర్వసంపదల నభివృద్ధిజేసెడి వినాయకవ్రతంబను వ్రతమొకటి కలదు. ఆ వ్రతమును భాద్రపదమాస శుక్లపక్ష చవితినాడు. ‘ప్రాతఃకాలమున స్నానము చేసి శుచిర్భూతుండై నిత్యకర్మంబులీడేర్చి తన శక్తికొలది బంగారంతోగాని, వెండితోగాని, మట్టితో గాని విఘ్నేశ్వర ప్రతిమను జేసి స్వగృహోత్తరదిశను మంటపం బేర్పరచి వడ్లుగాని, బియ్యముగాని పోసి అష్టదళపద్మంబేర్పరచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్టింపజేసి శ్వేత గంధాక్షత పుష్పపత్రాదులచే పూజించి ధూపదీపంబులను సమర్పించి కుడుములు మొదలైన పిండివంటలు, టెంకాయ, అరటిపండ్లు, నేరేడు పండ్లు, వెలగపండ్లు, చెఱకు మొదలగువానిని ప్రత్యేకముగా దినుసున కిరువది యెకటి ప్రకారము నైవేద్యము చేసి నృత్యగీత వాద్య పురాణపఠనాదులతో గణపతిపూజ సమాప్తిచేసి యధాశక్తిగా వేదవిదులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుజనులతో భక్ష్యభోజ్యాదులతో భుజింపవలయును. ఈ ప్రకారంబెవ్వడు గణపతి పూజ చేయునో వారికి గణపతి ప్రసాదమువలన సకల కార్యములు సిద్ధించును. ఇందుకు సంశయములేదు. మరునాడుదయమున లేచి స్నానాదులు కావించి పునఃపూజయొనర్చి వారి వారి శక్త్యానుసారముగ గణపతికి మౌంజీకృష్ణాజినదండ యజ్ఞోపవీత కమండల వస్త్రంబులిచ్చి విప్రులను దక్షిణతాంబుల భోజనాధులచే సంతృప్తుల జేయవలెను.

కుమారస్వామీ! వ్రతములో ఉత్తమంబైన ఈ వ్రతరాజము మూడు లోకములందును ప్రసిద్ధిజెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే నాచరింపబడినదని స్కంధునకు పరమశివుడుపదేశించెను.

కావున ధర్మరాజా! నువ్వ ఈ వ్రతాన్ని చేసినట్లయితే – తప్పనిసరిగా శత్రువులను జయించి, సమస్త సుఖాలనూ పొందుతావనడంలో యేమీ సందేహంలేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి యీ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీ కృష్ణుడంతటివాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను.

శ్యమంతకోపాఖ్యానం

 సత్రాజిత్తనే రాజుయొక్క భక్తికిమెచ్చి సూర్యుడతనికి శ్యమంతకమణిని ప్రసాదించినాడు. ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తునడిగాడు. కాని సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడయిన ప్రసేనజిత్తనేవాడు. ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కొడొక సింహం అతనిని వధించి – ఆ మణినొక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతూండగా ఆ అడవిలోనే వున్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి, ఆ మణిని తాను తీసుకొని – తన కుమార్తెయైన జాంబవతికి యిచ్చాడు. కాని, శ్యమంతకమణి మీద ఆశకలిగివున్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి, దానిని దొంగిలించి వుంటాడని సాత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా యిది నమ్మసాగారు.

ఆ వార్తవిని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ – శ్రీ కృష్ణుడు అన్నయ్యా! భాధపడకు వినాయక చవితినాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలననే నాకీ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడకీ – అపవాదుకీ సంబంధమేమిటని బలరాముడడుగగా శ్రీ కృష్ణుడిలా చెప్పసాగాడు.

శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట

 శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితినాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనందతాండవం చేస్తూ వుండగా అక్కడే వున్న చంద్రుడది అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు “

ఓరి చవితి చంద్రుడా! ఈ రోజు నుంచి నిన్ను చూసినవాళ్ళందరూ నీలాపనిందలపాలైపోయెదరు గాక! అని శపించాడు. అనంతరం, చంద్రుడూ, దేవతలూ కలిపి ప్రార్ధించిన మీదట – భాద్రపదశుద్ధ చవితి, నా జన్మదినంనాడు, శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని, ఆ కథాక్షతలని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బైటపడి అన్ని విధాలయిన సుఖసంపత్ సౌభాగ్యాలనూ పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసికూడా నేను గత వినాయ చవితినాడు ఆయనను పూజించకుండానే, ఆరాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబంబం చూడడం జరిగింది. అందువల్లనే ఈ అపనింద పడ్డాను – అని వివరంగా చెప్పాడు.

అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడు చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి, కృష్ణుడు తన ఆపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు.

జాంబత్యుపాఖ్యానము మరియు సత్యభామా పరిణయము

ఆ విధంగా శ్రీకృష్ణుడు. సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని, దాని చెంతనే వున్న సింహపు అడుగుజాడలనీ చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని, అతని గుహలోకి ప్రవేశించాడు. జాంవంతుడి కూతురు జాంబవి ఆమె యొక్క క్రీడాడోలకి కేళీకందుకంగా కట్టివుంది శ్యమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శ్యమంతక మణితో బాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీ కృష్ణునికి సమర్పించుకున్నాడు. మణితోనూ, కన్యామణితోను మరలివచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి, మణిని సత్రాజిత్తుకు యిచ్చాడు. కృష్ణునిని అనుమానించి, నింధించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తెయైన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే యిచ్చి వివాహం జరిపించాడు.

ధర్మరాజా! వృతాసురుణ్ణి సంహరించేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడూ, క్షీరసాగరమధనమప్పుడు దేవదానవులూ, సీతాన్వేషణలో శ్రీరాముడూ, కుష్టువ్యాధి. నివారణకు సాంబుడూ కూడా యీ వినాయ వ్రతాన్ని చేసి – విజయాయురారోగ్యాలను పొందారు. కావున ధర్మరాజా! నువ్వీవ్రతం చేసి, నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొంది – అని సూతుడు చెప్పగా, విని ధర్మరాజు ఈ వ్రతం చేసి, కష్టములు తీరి, శత్రువులను గెలిచి, రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. కావున మనస్సును తలచిన కార్యములన్నియు వినాయకవ్రతము సల్పుట వలన సిద్ధించుటచే గణేశుడు సిద్ధివినాయకుడని ప్రసిద్ధిజెందె.

విద్యారంభకాలమును పూజించిన విద్యాలాభమును, జయార్ధిజయమును, పుత్రార్థీపుత్రులను బడయుదురు. విధవ పూజించెనేని మరే జన్మమందైన వైధవ్యము పొందదు. కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు యధావిధిగా ఈ వ్రతంబాచరించి శ్రీ గణపతి యనుగ్రహముచే సకలైశ్వర్యములను బొంది సుఖముగా ముందరు గాక!

— ఇతి వినాయక వ్రతకథా సంపూర్ణం —

విఘ్నేశ్వరుని మంగళ హారతులు

శ్రీ శంభుతనయునకు – సిద్ధ గణానాథునకు – వాసిగలదేవతావంద్యునకును అసరస విద్యలకు అది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెగలవ్వ ఉత్తరేణు – వేఱువేఱుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజగొలు – శశిచూడరాకున్న జేకొంటి నొకవ్రతము పర్వమున దేవగణపతికినిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం పానకము వడపప్పు మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండు తేనెతో మాగిన తియ్యమామాడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదకి దండుపంపు- కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పుయు బొజ్జవిరుగగదినుచు పొరలుకొనుచు జయ మంగళం నిత్య శుభ మంగళం

సర్వేజన సుఖినోభవంతు – ఓం శాంతిః శాంతిః శాంతిః

Vinayaka Vratha Kalpam – PDF Click Here

Join WhatsApp Channel