Exit Polls 2024: ఈరోజే ఎగ్జిట్ పోల్స్ .. సర్వేలు ఎంతవరకు నమ్మవచ్చు ?!

Exit Polls 2024: ఈరోజే ఎగ్జిట్ పోల్స్ .. సర్వేలు ఎంతవరకు నమ్మవచ్చు ?!

మొత్తానికి లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుంది.. ఇక ఫలితాలు రావడమే ఆలస్యం. జూన్ 4న కౌంటింగ్ జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఈరోజు సాయంత్రం వెలువడే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. 

జూన్ 1న సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 
అప్పుడే అన్ని పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ చానెళ్లు ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేస్తాయి. ఇక రాత్రంతా చానల్స్ లో చర్చల జోరు.. ఫలితాల జోరు కనిపిస్తుంది. 
 ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. 

అసలు  ఎగ్జిట్ పోల్ సర్వేలను ఎంతవరకు నమ్మవచ్చు? 

2019 లోక్‌సభ ఎన్నికలు, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్‌కు ఎంత సామీప్యత ఉందో పరిశీలిద్దాం.
భారత్‌లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే కొన్ని ప్రధాన ఏజెన్సీలు సీ-వోటర్, యాక్సిస్ మై ఇండియా, సీఎన్‌ఎక్స్ మొదలైనవి ఉన్నాయి.
ఎన్నికల సమయంలో కొన్ని కొత్త ఏజెన్సీలు కూడా పుట్టుకొస్తాయి. ఎన్నికలు ముగియగానే ఇవి కనుమరుగు అవుతాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆధారపడి ఉంటుంది.

గత ఫలితాలు 

2019, 2014, 2009ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అప్పటి రియల్ పోల్స్ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పలు సంస్థలు ఎన్డీఏ కూటమికి 285 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ఏకంగా 353 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఒక్క బీజేపీనే సొంతగా 303 సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 91 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 
ఇక 2014 లో ఎన్డీఏ కూటమికి 257 నుంచి 340 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. 336 స్థానాలు సాధించింది.
అయికే గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఫైనల్ ఫలితాలు దాదాపు సమానంగా ఉంటున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 
మన భారత దేశంలో తొలిసారి 1957 ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 20 వేల నుంచి 30 వేల మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకుని సర్వే చేసేవారని ఢిల్లీలోని సోషల్ సైన్సెన్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్-సీఎస్‌డీఎస్‌కు చెందిన సంజయ్ కుమార్ వెల్లడించారు. 
దేశంలో నిర్వహించిన రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 1957లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్.. పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. 
ఇక 1996 లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్‌ నిర్వహించేందుకు.. ప్రభుత్వ ప్రసార ప్రసార సంస్థ దూరదర్శన్.. సీఎస్‌డీఎస్‌ను నియమించింది. ఆ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించడం ప్రారంభించాయి. ఇందులో కొన్ని సంస్థలు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువరుస్తున్నాయి.
Exit Polls 2024: ఈరోజే ఎగ్జిట్ పోల్స్ .. సర్వేలు ఎంతవరకు నమ్మవచ్చు ?!

Join WhatsApp Channel