మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పటిదాకా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ సందర్శించకపోవడం పట్ల ఆ రాష్ట్ర ప్రజలు చాలా బాధలో ఉన్నారని మణిపూర్ మాజీ గవర్నర్ అనుసూయా ఉయికే అన్నారు.
మణిపూర్ లో జరుగుతున్న అభివృద్ది పనుల వల్ల మోదీని ఆ రాష్ట్ర ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆయన ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడం వారిని బాధించిందని, అయితే అక్కడ నెలకుని ఉన్న పరిస్థితుల వల్ల ప్రధాన మంత్రి మరియు హోం మంత్రి అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. దాని గురించి నాకు తెలియదు.. అని ఆమె ఆదివారం ఒక మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
మణిపూర్ ప్రజలను పీఎం మోడీ నిరాశకు గురిచేశారా అని అడిగినప్పుడు, అలా ఏమీ కాదని అనసూయ ఉయికే అన్నారు.
“లేదు, నేను అలా అనుకోను. ఆ సమయంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు. మణిపూర్‌లో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పరిస్థితి మెల్లగా ప్రశాంతంగా మారుతోంది. మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేశారు” అని ఆమె తెలిపారు.
గత సంవత్సరం మే 3 నుండి మెయిటీ మరియు కుకీల మధ్య ఘర్షణల్లో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారు మరియు వేలాది మంది నిరాశ్రయులయ్యారు.