Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు..

భారత పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (అక్టోబర్ 9) రాత్రి తుదిశ్వాస విడిచారు. టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ రతన్‌ టాటా మరణ వార్తను ధ్రువీకరించారు. 1937 డిసెంబర్‌ 28న ముంబైలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు రతన్‌ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్‌ టాటా న్యూయార్క్‌ కార్నల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పొందారు. 2000లో రతన్‌ టాటా భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌, 2008లో రెండో అత్యున్న పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్నారు.

భారత అభివృద్దిలో.. పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో టాటా కీలకపాత్ర పోషించారు. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన ఆయన.. టాటా గ్రూప్‌ నుంచి రిటైర్మెంట్‌ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. దేశం కోసం అనుక్షణం తపించారాయన. కోవిడ్ సమయంలో రూ. 1500 కోట్ల భారీ విరాళం ప్రకటించి తన వంతు మానవత్వాన్ని చాటుకున్నారు.

సంతాపాల వెల్లువలు

రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సహా అనేకమంది దేశ విదేశ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీ తమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘‘రతన్‌ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’’అని మోడీ పేర్కొన్నారు.

“ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను” అని ముఖేష్ అంబానీ అన్నారు.

“టాటా మరణాన్ని ఆమోదించలేక పోతున్నానని.. ఆయన లాంటి లెజెండ్ లకు మరణం లేదని” ఆనంద్ మహీంద్రా అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే “దేశం ఒక అమూల్యమైన కుమారుడిని కోల్పోయిందని” అన్నారు.

Join WhatsApp Channel