నిజంగా జగన్ గద్దె దిగకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందా?

నిజంగా జగన్ గద్దె దిగకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందా?

రాష్ట్రం నాశనం అయిపోయింది ..

జగన్ ని గద్దె దింపడం తక్షణ అవసరం…

ఈ సారి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారం కావడం ఖాయం..

చాలా కాలంగా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు దాదాపు అన్ని మీటింగుల్లోనూ చెప్పే మాటలు ఇవే

నిజంగా రాష్ట్రానని జగన్ అంత నాశనం చేస్తున్నాడా? రాష్ట్రం అప్పుల కుప్ప అయిందా? అన్ని వ్యవస్థలూ జగన్ పాలనలో అధోగతి పాలయ్యాయా?

నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇది తెలిసే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాం అని ప్రకటించింది. అయితే సమయాభావం వల్లనో, ఇంక ఏ కారణం చేతనో ఆ అంశాన్ని బిల్లుగా పెట్టడంలో ఆ పార్టీ విఫలం అయింది. అలా కాంగ్రెస్ చేసిన తప్పుకి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ .. ఇంకా చెప్పాల్సి వస్తే భవిష్యత్ లో కూడా మూల్యం చెల్లించుకోవలసిన పరిస్తితిలో ఉంది. రాజధాని లేకుండా అవతరించిన రాష్ట్రానికి వారసత్వంగా అప్పులు మాత్రం సంక్రమించాయి. ఆదాయం సరిపోక అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోబడ్డారు. అనుభవస్తుడైన ఆయనకు మిత్రుడిగా కేంద్రంలో ఉన్న బిజెపి ఏమాత్రం సహకరించలేదు. హోదా సంగతి అటుంచితే.. రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వలేదు,అలాగే పోలవరం కూడా రాష్ట్రానికే అప్పజెప్పి చేతులు దులుపుకుంది. ఇక చంద్రబాబుకి అప్పులు చేయకతప్పింది కాదు. మరోవైపు “వోటుకి నోటు” కేసు వల్ల హైదరాబాద్ ని వదిలి వచ్చేయవలసి వచ్చింది. దాంతో ఖర్చులు పెరిగిపోయాయి. ఆదాయాన్ని పెంచవలసింది పోయి అమరావతిని తెరపైకి తెచ్చారు. ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కారు. చివరికి అధికారాన్ని కోల్పోయారు.

తదుపరి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి అర్ధమయ్యేసరికి దెబ్బ మీద దెబ్బ అన్నట్లు కరోనా విలయతాండవం చేసింది. అయినా తాను ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చాలి అని పథకాలను మాత్రం ఆపలేదు. దానితో అప్పులు చేయక తప్పలేదు. అయితే ఆయన ఆలోచనలు వేరేలా ఉన్నాయి.. రాష్ట్రానికి ఆదాయం రావాలని, అది మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలి అంటే విశాఖపట్నం ని రాజధానిగా చేస్తే తప్ప గత్యంతరం లేదు అని భావించారు. అయితే చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలవల్ల అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం సాధ్యం కాదు. అందుకే మూడు రాజధానిలు అంటూ క్రొత్త విధానాన్ని తీసుకు వచ్చారు. అలా తేవడం వల్ల అమరావతిని రాజధానిగా తొలగించకుండానే విశాఖ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రపంచానికి చూపడం ఆయన ఉద్దేశ్యం. కరోనా తర్వాత మిగిలిన మూడేళ్లలో అనేక విధాలుగా రాష్ట్ర ఆదాయంపైన, పరిశ్రమలు తీసుకు రావడం పైన, మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచడం అనేది ఆయన ముందు ఉన్న కర్తవ్యం అనే విషయం ఆయనకు తెలుసు.

ఇంతలో ఎన్నికల సంవత్సరం రానే వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పేదల మనసుల్లో స్థానం సంపాదిస్తున్నాడు అని, ఆయన బలపడుతున్నాడు అని అప్పటికే వివిధ ఎన్నికల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు పతనం అవుతున్న తన పార్టీని బ్రతికించాలి అంటే అధికారం తప్పదు అని నమ్మారు. వేరే వేరే మార్గాలలో జగన్ పై బురద జల్లడం ప్రారంభించారు. ప్రతీ అంశాన్నీ ప్రభుత్వ వ్యతిరేక వార్తలతో తన వెనుక ఉన్న బలమైన మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళ గలిగారు. అయినా జగన్ ని గద్దె దింపడానికి తన బలం, బలగం సరిపోదు అని పవన్ కళ్యాణ్ ని దగ్గరకు తీసుకున్నారు. “జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే తమకు, తమ పార్టీలకు భవిష్యత్ ఉండదు” అని ఆయన్ని నమ్మించారు. నిజానికి జగన్ మళ్ళీ అధికారం లోకి వస్తే కనుమరుగు అయ్యేది టిడిపి మాత్రమే. ఎందుకంటే టిడిపిని అప్పటికే ప్రజలు వ్యతిరేకించారు. ఒకవేళ భవిష్యత్ లో జగన్ ను ప్రజలు వ్యతిరేకిస్తే వారికి ఉన్న తదుపరి ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే. కానీ చంద్రబాబు తన చాతుర్యంతో పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు. ఇది మరోసారి టిడిపి ని బ్రతికించడానికే అనే విషయం ఎంత మంది చెప్పినా జనసేన అధినేత వినలేదు.

అయితే అందరికీ వీరు ఇద్దరు పెట్టుకున్న పొత్తు తమ అధికారం కోసం కాదని నమ్మించాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించారు. తమ మీడియా ద్వారా, సభల ద్వారా, వేరు వేరు మార్గాల ద్వారా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని, జగన్ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని, జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి జగన్ చేసిన అప్పులు చంద్రబాబు అప్పుల వృద్ధి తో పోలిస్తే తక్కువే! కరోనా వచ్చి ఆర్ధికవ్యవస్థ దిగజారినా జగన్ చేసిన అప్పులు ఎక్కడా వృధాగా ఖర్చు చేయలేదు. అనేక విభాగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. కేంద్రం లెక్కల్లో కూడా రాష్ట్ర ర్యాంకింగ్ పెరగడం గమనించ వచ్చు.

అయినా “జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడ”ని ఆయన ప్రత్యర్ధులు ప్రచారం చేస్తూనే ఉన్నారు..

Join WhatsApp Channel