Delimitation Issue: అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి

0
4
reventh-reddy
reventh-reddy

దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ నేరుగా అధికారంలో లేదని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి డీలిమిటేషన్‌ అంశాన్ని మోడీ సర్కారు తెరపైకి తీసుకువచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన “డీలిమిటేషన్‌కు దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వినిపిస్తున్నా, ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్ డీలిమిటేషన్‌కు సిద్ధమవుతోంది. దీనికి కారణం దక్షిణాదిలో బీజేపీకి సరైన ప్రాతినిధ్యం లేదు. ఎన్టీయే మూడోసారి అధికారం చేపట్టినా గెలిచిన 240 సీట్లలో దక్షిణాది నుంచి కేవలం 29 స్థానాలే దక్కించుకుంది. అందుకే నియోజకవర్గాల పునర్ విభజన చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.” అన్నారు.

“ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతోపాటు పంజాబ్ వంటి రాష్ట్రాలకూ నష్టం జరుగుతుంది. బిహార్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే చేయాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం.” అన్నారాయన.

ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ “ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ సమక్రంగా అమలు చేశాయి.గతంలో కేంద్రం తెచ్చిన “మేమిద్దరం మనకిద్దరు” అనే నినాడానికి కట్టుబడి ఉండడం వల్లే దక్షిణాదిన జనాభా తగ్గింది. 30 ఏళ్లపాటు డీలిమిటేషన్ అమలు చేయకుండా ఉంటే దక్షిణ భారతదేశ సత్తా ఏంటో చూపిస్తాం.” అని విమర్శించారు.

డీలిమిటేషన్‌పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.