ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్రకోసం వెళ్ళిన నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనీసం ఎనిమిది నెలలపాటు గడుపవలసి వస్తోంది. అంటే దాదాపు 240 రోజులు అన్నమాట. ఇది ఒక రికార్డుగా నిలవబోతోంది.
80 రోజులుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీతా విలియమ్స్ లను తిరిగి తీసుకువచ్చే విషయంలో పరిస్థితిని చర్చించడానికి NASA ఆగస్ట్ 24, శనివారం నాడు సమీక్ష నిర్వహించింది.
వారిని తీసుకువెళ్ళిన స్టార్‌లైనర్ వాహనం త్వరలో ఖాళీగానే తిరిగి భూమికి రానుంది. అయితే ఫిబ్రవరి 2025లో విలియమ్స్ మరియు విల్మోర్‌లను ఇంటికి తీసుకురావడానికి SpaceX క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను ఉపయోగించవచ్చని NASA నిర్ధారించింది.
విలియమ్స్ (58) మరియు విల్మోర్ (61) జూన్ 5 న ఫ్లోరిడా యొక్క స్పేస్ కోస్ట్‌లోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బోయింగ్ యొక్క స్టార్‌లైనర్ లో వెళ్లారు. అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత వారు ప్రయాణించిన ఆ వాహనంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి… హీలియం లీక్‌తో పాటూ అనేక సమస్యలు ఎదుర్కొంది. అయితే ఇవి చిన్న పాటి సమస్యలే అని వ్యోమగాములు సమయానికి ఇంటికి రావడాన్ని అవి ప్రభావితం చేయవని బోయింగ్ మొదట్లో పేర్కొంది. అయితే కొన్ని రోజుల తర్వాత నాసా వారిని అదే వాహనంలో తీసుకు వచ్చే విషయంలో వెనుకంజ వేసింది.
దీనితో స్టార్‌లైనర్ ఎవరూ లేకుండానే భూమికి తిరిగి రానున్నది.. ఇక వాళ్ళు తిరిగి రావడానికి ఫిబ్రవరి 2025 వరకు వేచి ఉండాల్సిందే..