పాకిస్తాన్ 24వ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య జరిగిన ఓటింగ్ లో 201 ఓట్ల మద్దతుతో పదవిని సొంతం చేసుకున్నారు షరీఫ్.
ఫిబ్రవరి 8న జరిగిన పాక్ ఎన్నికలలో జైలులో ఉన్న మాజీ పదవీచ్యుత పధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన PTIతో పొత్తుపెట్టుకున్న స్వతంత్ర అభ్యర్థులు 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గాను 93 స్థానాల్లో విజయం సాధించగా నవాజ్ షరీఫ్ సారథ్యంలోని PML-N 75 స్థానాల్లోనూ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జాతీయ అసెంబ్లీలో 54 సీట్లు సాధించింది.ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే సుదీర్ఘ చర్చల తరువాత PML-N, PPP పార్టీలు పలువురు స్వతంత్రుల మద్దతుతో పార్లమెంట్ లో 201 ఓట్ల మద్దతుతో గెలవగా రెండోసారి ప్రధాని పదవిని సొంతం చేసుకున్నారు షరీఫ్. షాబాజ్ గత ఆగస్టు 2023 వరకు 16 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
ఎన్నిక కాగానే షాబాజ్ తన అన్న అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ని ఆనందంతో హత్తుకున్నారు. ఇదిలా ఉండగా, అయాజ్ సాదిక్ పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. PML-N, PPP కూటమి ఒప్పందంలో భాగంగా నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. PPP నాయకుడు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి దక్కనుంది.
ప్రధానిగా ఎన్నికైన తరువాత పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు ప్రధాని షరీఫ్. ఆకాశాన్నంటుతున్న కరెంటు, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. పన్నుల ఎగవేత అంశాన్ని సమీక్షిస్తానని.. ఈ సమస్యను పరిష్కరిస్తే పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంటుందని షరీఫ్ తెలిపారు.